బ్యాంకుల విలీనానికి గ్రీన్‌సిగ్నల్

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ)లో ఇతర బ్యాంకుల విలీన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సోమవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసులు, ఆర్థిక మంత్రిత్వ శాఖల నుంచి ఈ విలీనానికి అనుమతినిస్తూ ఈ నెల 13న ప్రత్యేక లేఖను జారీ చేసినట్లు బ్యాంక్ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. పీఎన్‌బీలో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ)లు విలీనమవుతున్న విషయం తెలిసిందే. దీంతో విలీనంకానున్న బ్యాంకుల శాఖలు, ఉద్యోగులు, ఖాతాదారులు, ఇతర ఆర్థికాంశాలు పీఎన్‌బీకి బదిలీకానున్నాయి. అలాగే ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం కానున్న ప్రతిపాదను కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రభుత్వరంగ బ్యాంకులను బలోపేతం చేయడానికి విలీనానికి తెరలేపుతూ ఆగస్టులో తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కి పడిపోనున్నది. పీఎన్‌బీలో ఓబీసీ, యూబీఐలు విలీనమైన తర్వాత దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకుగా అవతరించనున్నది. వీటితోపాటు సిండికేట్ బ్యాంక్‌లో కెనరా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్‌లో ఇండియన్ బ్యాంక్ కలిసిపోనున్నాయి. ఈ ఏడాది జనవరిలో దేనా, విజయా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేసే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.