-పార్లమెంట్ భవనంవైపు జేఎన్‌యూ విద్యార్థుల ర్యాలీ
-పోలీసుల లాఠీచార్జి.. హాస్టల్ ఫీజు పెంపుపై నిరసన
-హాస్టల్ ఫీజు పెంపుపై నిరసనగా ఢిల్లీలో ర్యాలీ
-పార్లమెంట్‌వైపు అడుగులు
-అడ్డుకున్న పోలీసులు..విద్యార్థులపై లాఠీచార్జి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థులు తమ ఆందోళనను ఉద్ధృతం చేశారు. హాస్టల్ ఫీజు పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ గత మూడు వారాలుగా యూనివర్సిటీ పరిసరాల్లోనే నిరసన చేపడుతున్న విద్యార్థులు సోమవారం రోడ్డెక్కారు. ప్లకార్డులు చేతబట్టి నినాదాలతో హోరెత్తించారు. సోమవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో తమ సమస్యను చట్టసభల దృష్టికి తీసుకెళ్లేందుకు పార్లమెంట్ భవనంవైపు బయలుదేరారు. అయితే బాబా గణనాథ్ మార్గ్ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. బలవంతంగా ముందుకెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులపై లాఠీచార్జి జరిపారు.
100 మందికిపైగా విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల లాఠీచార్జిలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. నిర్బంధంలోకి తీసుకున్న విద్యార్థులను విడుదల చేయాలని, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (హెచ్చార్డీ) అధికారులతో సమావేశాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్‌చేస్తూ సఫ్దర్‌జంగ్ సమాధి వెలుపల ఉన్న రోడ్డుపై విద్యార్థులు బైఠాయించారు. ఢిల్లీ పోలీసులు వారితో చర్చలు జరుపుతున్నారు. విద్యార్థుల నిరసనతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది.. పార్లమెంట్ సమీపంలోని పలు మెట్రో స్టేషన్ల గేట్లను తాత్కాలికంగా మూసివేశారు. విద్యార్థులు ర్యాలీ ఫొటోలతోపాటు, పోలీసులు లాఠీచార్జి జరుపడంతో తమకు అయిన గాయాల ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా ఎమర్జెన్సీ ఇన్ జేఎన్‌యూ అన్న హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది.
కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం..
జేఎన్‌యూలో సాధారణ పరిస్థితులు ఏర్పడేలా చేసేందుకు హెచ్చార్డీ శాఖ ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటుచేసింది. విద్యార్థులు, వర్సిటీ యంత్రాంగంతో ఈ కమిటీ చర్చలు జరిపి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రానికి నివేదికను సమర్పించనుంది.ఇది మోదీ ఎమర్జెన్సీ: ఏచూరి
విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఖండించారు.ఇది మోదీ ఎమర్జెన్సీ అని విమర్శించారు. నాటి ఎమర్జెన్సీ కంటే నేడు పోలీసులు ఎక్కువగా ఉన్నారంటూ నాడు జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న ఏచూరి గతాన్ని గుర్తు చేసుకున్నారు.లోక్‌సభలో ప్రస్తావన
జేఎన్‌యూ విద్యార్థుల నిరసనల అంశాన్ని బీఎస్పీ సభ్యుడు డానిష్ అలీ లోక్‌సభలో లేవనెత్తారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలో విద్యావ్యవస్థ ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ అవుతుండడం విచారకరమన్నారు.