సీజేఐగా బోబ్డే ప్రమాణం


-రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి కోవింద్
-తల్లి పాదాలకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న జస్టిస్ బోబ్డే
-కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు
-లాయర్ల కుటుంబం నుంచి.. సీజేఐ దాకా
-పలు కీలకతీర్పుల్లో భాగస్వామి


న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే (63) బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డేతో సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు. అనంతరం సీజేఐ బోబ్డే తన తల్లి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనారోగ్యంతో ఉన్న ఆమెను స్ట్రెచర్‌పై రాష్ట్రపతి భవన్‌కు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, మాజీ సీజేఐ రంజన్‌గొగోయ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆర్‌ఎం లోధా, టీఎస్ ఠాకూర్, జేఎస్ ఖేర్, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. జమైకా దేశ ప్రధాన న్యాయమూర్తి బ్రయాన్ స్కైస్, భూటాన్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి కున్లే త్సెహ్రింగ్ అతిథులుగా హాజరయ్యారు. ప్రమాణం అనంతరం సీజేఐ బోబ్డే సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాకేశ్ ఖన్నా, సీనియర్ న్యాయవాదులు ఆయనకు అభినందనలు తెలిపారు. జస్టిస్ బోబ్డే 2021 ఏప్రిల్ 23 వరకు సీజేఐ పదవిలో కొనసాగనున్నారు.


లాయర్ల కుటుంబం నుంచి..


సీజేఐ ఎస్‌ఏ బోబ్డే 1956 ఏప్రిల్ 24న జన్మించారు. స్వస్థలం మహారాష్ట్రలోని నాగపూర్. ఆయన కుటుంబంలో ఎక్కువశాతం మంది న్యాయవాదులే. జస్టిస్ బోబ్డే తాత న్యాయవాది. తండ్రి అరవింద్ బోబ్డే మహారాష్ట్రలో 1980-85 మధ్య అడ్వకేట్ జనరల్‌గా పనిచేశారు. అన్నయ్య వినోద్ అరవింద్ బోబ్డే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా పనిచేశారు. జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే 1978లో నాగపూర్ యూనివర్సిటీ నుంచి న్యాయవాద పట్టా పొందారు. అదే ఏడాది సెప్టెంబర్ 13న న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1998లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టారు. బోబ్డే 2000 మార్చి 29న బాంబే హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2012 అక్టోబర్ 16న మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు ఏడాది తర్వాత 2013 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ముంబై హైకోర్టు బార్ అసోసియేషన్ నుంచి సీజేఐ వరకు ఎదిగిన ఎనిమిదో వ్యక్తిగా జస్టిస్ బోబ్డే నిలిచారు.


పలు కీలక తీర్పులు..


జస్టిస్ బోబ్డే తన కెరీర్‌లో పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. అయోధ్య వివాదానికి తెరదించుతూ చారిత్రాత్మక తీర్పునిచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో ఆయన కూడా ఉన్నారు.
-మాజీ సీజేఐ రంజన్‌గొగోయ్‌పై గత ఏడాది ఒక మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వాటిపై విచారణ జరిపి, ఆయనకు క్లీన్‌చిట్ ఇచ్చిన త్రిసభ్య ధర్మాసనంలో జస్టిస్ బోబ్డే కూడా ఉన్నారు.
-జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవలే బీసీసీఐ పాలనావ్యవహారాల నుంచి మాజీ కాగ్ వినోద్ రాయ్ నేతృత్వంలోని పాలనాధికారుల కమిటీ తప్పుకోవాలని, బాధ్యతలను నూతనంగా ఎన్నికైన బోర్డు సభ్యులకు అప్పగించాలని ఆదేశించింది.
-ఢిల్లీలో వాయుకాలుష్యం విషమ స్థాయికి చేరడంతో.. 2016లో జస్టిస్‌లు బోబ్డే, టీఎస్ ఠాకూర్, అర్జున్ కుమార్ సిక్రితో కూడిన ధర్మాసనం దీపావళినాడు పటాకులు కాల్చడంపై ఆంక్షలు విధించింది.
-ఆధార్ వినియోగంపై స్పష్టత ఇస్తూ సుప్రీంకోర్టు 2015లో ఇచ్చిన తీర్పులో జస్టిస్ బోబ్డే కూడా భాగస్వామి. ఆధార్ కార్డు లేకున్నా ప్రభుత్వ సేవలన్నీ పొందవచ్చని త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది.
-2017లో మాతే మహాదేవి అనే పుస్తకం వల్ల బసవన్న భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని, ఇది మత ఘర్షణలకు దారితీసే అవకాశం ఉన్నదంటూ కర్ణాటక ప్రభుత్వం ఆ పుస్తకంపై నిషేధం విధించడాన్ని జస్టిస్‌లు ఎస్‌ఏ బోబ్డే, ఎల్ నాగేశ్వర్‌రావుతో కూడిన ధర్మాసనం సమర్థించింది.


బైకులు, ఫొటోగ్రఫీ అంటే ఇష్టం


జస్టిస్ బోబ్డేకు బైకులు, ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. అత్యాధునిక సాంకేతికతపై ఆసక్తి. అందుకే కోర్టుల్లో కృత్రిమ మేధను ప్రవేశపెట్టాలని ఆయన ఎన్నాళ్లుగానో చెప్తున్నారు. ఆయనకు పనితప్ప ఇంకో లోకం లేదని సహచరులు చెప్తుంటారు.