జిల్లా వ్యాప్తంగా డయల్ 100 పై అవగాహన సదస్సులు
- నా పోలీస్ - నా భద్రత పేరుతో సదస్సుల నిర్వహణ
పలు చోట్ల పాల్గొన్న అదనపు ఎస్పీ నర్మద
విద్యార్థుల నుండి పెద్ద ఎత్తున స్పందన
నల్గొండ : జిల్లా వ్యాప్తంగా నా పోలీస్ - నా భద్రత పేరుతో డయల్ 100 పై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించారు.
మంగళవారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సంబంధిత పోలీస్ అధికారులు పాఠశాల, కళాశాల విద్యార్థినీలకు అవగహన సదస్సు నిర్వహించారు. అత్యవసర, ఆపద సమయాలలో పోలీసులకు సమాచారం అందించడం, డయల్ 100కి ఫోన్ చేసి సమస్యలను తెలియచేస్తే నిమిషాల వ్యవధిలో పోలీసులు ఎలా సంఘటనా స్థలానికి చేరుకొని రక్షణ కల్పిస్తారనే అంశాలను వారికి వివరించారు. అదే సమయంలో ఎలాంటి సమస్య వచ్చినా అధైర్యపడకుండా కొంచం సమయస్ఫూర్తితో పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలంగాణ పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతలు, మహిళల రక్షణ ధ్యేయంగా పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు. డయల్ 100 తో పాటుగా వివిధ రకాల టోల్ ఫ్రీ నెంబర్లు మహిళా రక్షణ కోసం అందుబాటులో ఉన్నాయని, షీ టీమ్స్ నిరంతరం డేగ కళ్ళతో మహిళల రక్షణ కోసం పని చేస్తున్నాయని పోలీస్ అధికారులు చెప్పారు.
మహికా రక్షణకు అధిక ప్రాధాన్యం : నర్మద
మహిళల రక్షణ లక్ధ్యంగా జిల్లాలో నిరంతరం పోలీస్ శాఖ కృషి చేస్తున్నదని అదనపు ఎస్పీ నర్మద తెలిపారు. డయల్ 100 పై జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన అవగాహన సదస్సులలో ఆమె పలు చోట్ల పాల్గొని మాట్లాడుతూ ఎలాంటి సమయంలోనైనా డయల్ 100కు ఫోన్ చేస్తే కేవలం 4 నుండి 5 నిమిషాల వ్యవధిలో అక్కడకు చేరుకొని సమస్య పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పెట్రో కార్స్, బ్లూ కోట్స్ సిబ్బందితో పాటు సంబంధిత స్టేషన్ల సిబ్బంది స్పందిస్తూ మహిళా, విద్యార్థినీల సమస్యలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఎప్పటికప్పుడు ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రజలు, మహిళలు, యువతులు, విద్యార్థినీల సమస్యలపై సత్వరం స్పందించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నదని స్పష్టం చేశారు.
నా పోలీస్ - నా భద్రత
తెలంగాణ రాష్ట్రంలో ప్రజల భద్రత ప్రధాన లక్ష్యంగా నా పోలీస్ - నా భద్రత పేరుతో పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహిస్తూ డయల్ 100తో పాటు పోలీస్ శాఖ ప్రజా భద్రత కోసం ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నదో అందరికి తెలియచేయడం ద్వారా చైతన్యవంతం చేయడం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా నా పోలీస్ - నా భద్రత పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలతో మమేకం అవుతున్నట్లు పోలీస్ అధికారులు వివరించారు.